Coffee Today

Thursday, October 10, 2019

DATA SALE .. BECAREFUL ,!

మన డేటా... కాటా వేసి అమ్మేస్తున్నారు!

సీరియస్‌గా పని చేసుకుంటుంటే, సడన్‌గా ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ఫలానా బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నామనీ, మీ వివరాలన్నీ కరెక్ట్‌గా చెప్పాలనీ, ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలనీ ఒత్తిడి చేస్తారు. తీరా చూస్తే అకౌంట్లో డబ్బులు ఖాళీ!
‘దసరా వచ్చింది కదా!’ అని అమెజాన్‌ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో నచ్చిన ఫోన్‌, ఇంకో వస్తువు ఏదైనా కొంటే చాలు... ‘మీరు తాజాగా కొన్న వస్తువుకి రూ. 11 లక్షల విలువైన కారు గెలుచుకున్నారు!’ అంటూ ఓ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అందులో రిజిస్ట్రేషన్‌ కోసం కొంత డబ్బు చెల్లించమంటారు. మీరు చెల్లించాక, దఫాల వారీగా దాదాపు రూ 10-15 వేల వరకు మీ నుంచి దోచుకున్నాక ఫోన్‌ ఎత్తడం మానేస్తారు. 
ఇలాంటి మోసాలు ఎనెన్నో! అసలు మన ఫోన్‌ నెంబర్లు, అడ్రస్‌లను ఈ మోసగాళ్లు ఎలా సేకరిస్తున్నారో తెలిస్తే షాక్‌ అవుతారు. ఈ విషయాలన్నిటి మీదా ‘ఆంధ్రజ్యోతి’ లోతుగా అధ్యయనం చేసింది. ఇవిగో వివరాలు...
 
షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్ల లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రకరకాల ఆఫర్స్‌ ఉన్నాయంటూ మన ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ తదితర సమాచారం సేకరిస్తారు. ఆ డేటా మొత్తం మార్కెటింగ్‌ సంస్థలకి అమ్మేస్తారు. అలాగే జిరాక్స్‌ సెంటర్ల ద్వారా కూడా భారీగా డేటా సేకరిస్తున్నారు. దాదాపు అన్ని రకాల జిరాక్స్‌ సెంటర్లలో మల్టీ ఫంక్షన్‌ డివైజ్‌లు వాడుతుంటారు. అంటే అది కాపీయర్‌, స్కానర్‌, ప్రింటర్‌గానూ పనిచేస్తుంది. మీరు ఆధార్‌ కార్డు ఇచ్చి రెండు కాపీలు జిరాక్స్‌ ఇవ్వమని అడిగిన వెంటనే వారు రెండు కాపీలు ప్రింట్‌ చేస్తారు. కానీ, మీకు తెలియకుండానే మీ ఆధార్‌ కార్డు ఆ జిరాక్స్‌ సెంటర్లలో ఉండే హార్డ్‌డిస్క్‌లో పర్మనెంట్‌గా సేవ్‌ అవుతుంది. ఆ డేటాని అమ్ముకొనే జిరాక్స్‌ సెంటర్ల వాళ్ళు కోకొల్లలు. అంతేకాదు, జిరాక్స్‌ సెంటర్‌ ద్వారా సేకరించిన పాన్‌ కార్డులను ఆధారంగా చేసుకొని తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లతో కుమ్మక్కై, మీ పేరిట మీకు తెలియకుండానే బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసి, వాటి మీద సులభంగా లోన్లు తీసుకుంటున్న కేటుగాళ్లు కూడా ఉన్నారు. అలాంటి అయిదారు కేసులు వ్యక్తిగతంగా నా దృష్టికి వచ్చాయి. మీకు తెలియకుండా మీ పేరు మీద ఎవరైనా లోన్‌ తీసుకుంటే, ఆ వాయిదాల్ని మీరు కట్టక తప్పదు.
 
ఉద్యోగుల ద్వారా...
అనేక బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు పెద్ద మొత్తంలో థర్డ్‌-పార్టీలకి వినియోగ దారుల డేటా అమ్ముతున్నారు. వివిధ వ్యక్తులకు కేటాయించిన క్రెడిట్‌ కార్డు నెంబర్లు, వారి ‘ఫస్ట్‌ నేమ్‌’, ‘లాస్ట్‌ నేమ్‌’, చివరకు ‘ఎక్స్‌పెయిరీ’ డేట్‌ వివరాలు కూడా అమ్మేస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని కొంతమంది బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నామని నమ్మించి, సివీవీ నెంబర్లు, ఓటీపీలు అడుగుతున్నారు. అలాగే వివిధ ఇ- కామర్స్‌ వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు మనం జరిపే కొనుగోళ్లకి సంబంధించిన సమాచారం కూడా నేరస్థులకు వెంటనే వెళుతోంది. దీని కోసం కొంత మంది ఉద్యోగుల సహకారం తీసుకోవడంతో పాటు, ఆయా ఈ-కామర్స్‌ సర్వర్ల నుంచి కొనుగోలుదారు సమాచారాన్ని సులభంగా సేకరించే కొన్ని ప్రత్యేకమైన స్ర్కిప్ట్‌లు వాడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో మనకు వస్తువు అమ్మిన అమ్మకందారు మన వివరాలు అమ్ముతున్నట్లు నిరూపితమైంది.
 
రక్షణ ఎలా?
మన దేశంలో కఠినమైన డేటా ప్రైవసీ చట్టాలు లేకపోవడం దురదృష్టకరం. మన డేటాను ఒక సంస్థ దుర్వినియోగం చేస్తే... వెంటనే ఆ సంస్థ మీద పోరాడగలిగే వ్యవస్థ, చట్టాలు ఉండాలి. అలాగే అడ్రస్‌ లేని సంస్థలన్నీ ఆఫర్ల పేరిటా, ఎస్‌ఎంఎస్‌ షార్ట్‌ కోడ్‌లు పంపిస్తూ, వాట్సప్‌ గ్రూప్‌లు తయారు చేస్తూ, ‘ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌’ అనీ, ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్‌’ అనీ మోసం చేస్తూ ఉంటే.. అలాంటి షార్ట్‌ కోడ్‌లను బ్లాక్‌ చేసే వ్యవస్థ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వద్ద లేకపోవడం శోచనీయం. అంతేకాదు, పదివేల రూపాయల ఫోన్‌ రూ. 500లకే ఆఫర్‌లో వస్తోందంటే కొనే వాళ్లు ఉన్నంతవరూ ఇలా ఫోన్‌ నెంబర్లు సేకరించి వల వేయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమే మనకు రక్ష!
 
జాబ్‌, మ్యాట్రిమోనియల్‌ సైట్లు
ఉద్యోగం కోసం, పెళ్లి కావడం కోసం నిరుద్యోగులు జాబ్‌, మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో తమ వివరాలు పొందుపరుస్తూ ఉంటారు. మీకు తెలియకుండా ఈ డేటా మొత్తం భారీగా అమ్ముడవుతోంది. ఉదాహరణకు నెల్లూరులో నివసిస్తూ వివిధ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న కొంతమంది యువతీ యువకుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు, పుట్టినతేదీ, అడ్రస్‌ లాంటి సమాచారం మొత్తం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. ఈ విధంగా కోట్లాది మంది నిరుద్యోగుల సమాచారం మొత్తం సేకరించడం జరుగుతోంది. అనేక మాట్రిమోనియల్‌ సైట్లు వీటిని ప్రీమియం ధరలకి అమ్మితే, ఆ డేటా మొత్తం మళ్లీ ముక్కలు ముక్కలుగా చవక రేట్లకు చేతులు మారుతోంది.
 
 
ఎన్నో ప్రమాదాలు
ఒక వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ, అడ్రస్‌ లాంటివి ఉంటే చాలు... ఎలాంటి మోసమైనా చెయ్యొచ్చు. ఉదాహరణ ఇక్కడ సీతారామయ్య చౌదరి అనే వ్యక్తి తాలూకు వివరాలు డేటాబేస్‌లో ఉన్నాయి. (ఆయన ప్రైవసీ కాపాడడం కోసం ఆ వివరాలను బ్లర్‌ చేశాం). ఎవరైనా మోసగాడు ఇలాంటి సమాచారం ఆధారంగా చేసుకొని, గూగుల్‌ మ్యాప్స్‌ ఉపయోగించి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, ఏ మోసమైనా చేయవచ్చు. లేదా అందులో ఉండే పుట్టిన తేదీ, ఇతర ఆధారాలను ఆసరాగా చేసుకుని ఓటీపీ మోసాలకు పాల్పడవచ్చు. ఒకవేళ మహిళల సమాచారం గనుక లభిస్తే వారిని వాట్సప్‌ ద్వారా వేధించవచ్చు. ఆ మహిళల అడ్రస్‌ కూడా నేరుగా లభిస్తుంది కాబట్టి నేరుగా వెళ్లి అఘాయిత్యాలకు పాల్పడవచ్చు. నిరుద్యోగులతో ‘మీకు జాబ్‌ ఆఫర్‌ ఉంది’ అంటూ కట్టు కథలు చెప్పి భారీగా డబ్బు దోచుకోవచ్చు. ఇవన్నీ అనునిత్యం మన చుట్టూ జరుగుతున్న మోసాలు! మన ఫోన్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీలు, అడ్రస్‌లు... ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నిటినీ ఈ విధంగా అమ్మేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎంతోమందికి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
 
బఠాణీల కన్నా చౌకగా
ఇంటర్నెట్లోకి వెళితే... హైదరాబాద్‌, విజయవాడ, వరంగల్‌, వైజాగ్‌, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లో నివసించే కోట్లాదిమంది ప్రజల ఫోన్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీలు కేవలం ‘వంద రూపాయలకే పొందొచ్చు’ అంటూ అనేక ఆఫర్స్‌ కనిపిస్తాయి. ఈ డేటా ఎంత కస్టమైజ్డ్‌గా ఉంటుందంటే... మీకు కేవలం నిరుద్యోగుల ఫోన్‌ నెంబర్లు కావాలంటే తీసుకోవచ్చు. లేదా మహిళల ఫోన్‌ నెంబర్లు, అడ్రస్‌లు మాత్రమే కావాలంటే వాటిని కొనుగోలు చేయవచ్చు. గవర్నమెంట్‌ ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు... ఇలా అన్ని రంగాలకు చెందిన వ్యక్తుల ఫోన్‌ నెంబర్ల డేటాబేస్‌ విడివిడిగా లభిస్తోంది. ఒక్కో డేటాబేస్‌ కొనుగోలు చేయటానికి దాని పరిమాణం, దాంట్లో ఉండే ఎంట్రీలను బట్టి 10 రూపాయలు మొదలుకొని 5వేల వరకు వసూలు చేస్తున్నారు. మోసాలు సాగించే వ్యక్తులు ఒకసారి దీన్ని కొనుగోలు చేస్తే చాలు! ఇక చీటికిమాటికి ఆ నెంబర్లకు కాల్‌ చేయడం ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు, ఆ డేటా మొత్తం మళ్లీ ఇతరులకు చవకగా అమ్మకానికి పెడతారు. కర్నూలులో ఉండే ఉద్యోగులకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీలు, ఇంటి అడ్రస్‌లు కేవలం వంద రూపాయలకి ఎలా అమ్ముతున్నారో ఈ ఫొటోలో చూడొచ్చు.
 

No comments:

Post a Comment