Coffee Today

Tuesday, October 22, 2019

Bahubali .. Last character of the Story.

కథలో చివరిగా వచ్చిన పాత్ర ‘బాహుబలి’
కథలో చివరిగా వచ్చిన పాత్ర ‘బాహుబలి’
ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బాహుబలి’ కథను మొదట అనుకోలేదని, తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ మొదట శివగామి పాత్ర గురించి మాత్రమే చెప్పారని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ‘బాహుబలి’ చిత్రం రికార్డులను సృష్టించింది. తాజాగా లండన్‌లోని ప్రఖ్యాత ‘రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌’లో ప్రదర్శితమైన నాన్‌-ఇంగ్లీష్‌ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు ప్రభాస్‌, రానా, అనుష్క సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, నిర్మాత శోభుయార్లగడ్డ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చిట్‌చాట్‌లో పలు ప్రశ్నలకు బాహుబలి చిత్ర బృందం సమాధానాలు చెప్పింది. 
‘బాహుబలి ఎలా మొదలైంది?
రాజమౌళి: నాన్నగారు మొదట ‘బాహుబలి’ కథ చెప్పలేదు. కేవలం శివగామి పాత్ర గురించి మాత్రమే చెప్పారు. ఆ తర్వాత భళ్లాలదేవుడు, కట్టప్ప పాత్రలు చెప్పి, చివరకు బాహుబలి పాత్ర గురించి చెప్పారు. ఆ పాత్రల గురించి చెప్పినప్పుడు నాకు ఏదైతే ఆసక్తికరంగా అనిపించిందో అదే ప్రేక్షకులకు కలిగించాలనే ప్రయత్నమే ఈ ఐదేళ్ల ‘బాహుబలి’ జర్నీ. అలా బాహుబలి మొదలైంది.
కథలో చివరిగా వచ్చిన పాత్ర ‘బాహుబలి’
ప్రభాస్‌ను ఎలా ఒప్పించారు?
రాజమౌళి: అప్పటికే నేను ప్రభాస్‌తో ‘ఛత్రపతి’ చేశా. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య సినిమాలకు సంబంధించి అనేక విషయాలు చర్చకు వచ్చేవి. అదే మా మధ్య స్నేహం మరింత బలపడేలా చేసింది. కూర్చొని కబుర్లు చెప్పుకొంటుంటే తెల్లవారిపోయేది. సినిమాలు, జీవితం, భవిష్యత్‌లో ఏం చేయాలి? ఇలా మా మధ్య చర్చలు నడిచేవి. అప్పుడే ‘రాజులు.. యుద్ధాలు నేపథ్యంలో ఒక భారీ సినిమా తీయాలి’ అని ఒక సందర్భంలో చెప్పా. వెంటనే ‘డార్లింగ్‌ నువ్వు అలాంటి సినిమా చేస్తే, నీకు ఎన్నిరోజులు డేట్స్‌ కావాలంటే అన్ని రోజులు ఇస్తా’ అని ప్రభాస్‌ నాతో చెప్పాడు. అలా తర్వాత అది ‘బాహుబలి’గా చిత్రంగా పట్టాలెక్కింది 
ఇంత భారీ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు రాజమౌళికి మీరు ఏదైనా సలహా ఇచ్చారా?
ఎం.ఎం.కీరవాణి:  బాహుబలి తీయాలనుకున్నప్పుడు రాజమౌళి వచ్చి నన్ను కలిశాడు. ‘ఒక భాగంగా తీద్దామా? లేక రెండు భాగాలుగా తీద్దామా? అన్నప్పుడు నేను ఒక భాగంగానే తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. ఎందుకంటే ఇందులో అత్యధికమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అలా చెప్పా. అయితే ఆ తర్వాత రెండు భాగాలుగా తీశాం.
కథలో చివరిగా వచ్చిన పాత్ర ‘బాహుబలి’
దేవసేన పాత్రకు ఎలా సిద్ధమయ్యారు?
అనుష్క: రాజమౌళి కథ చెప్పిన విధానం నేను ఇప్పటికీ మర్చిపోలేను. అన్ని ఎమోషన్స్‌ను ఆయన చేసి చూపించారు. నా ఒళ్లు గగుర్పొడిచింది. దేవసేన పాత్రకోసం అనేక రకాల మేకప్‌ టెస్ట్‌ చేశారు. ముఖ్యంగా పార్ట్‌-1లో మేకప్‌ కోసం హాలీవుడ్‌ నుంచి నిపుణులు వచ్చారు. బందీగా ఉన్న దేవసేన వయసు పెరిగినట్లు చూపించాలి. ఆ ఫీల్‌ ప్రేక్షకుడికి కలగాలి. అదే సమయంలో తల్లి పాత్రను చేస్తే ఎవరు ఏమనుకుంటారోనని నేను ఏమాత్రం భావించలేదు. దేవసేన పాత్రలో ఒక మహిళ పూర్తి జీవితం ఉంటుంది. ఆ పాత్రకు ప్రతి మహిళ కనెక్ట్‌ అవుతుందని భావించాం. ఎందుకంటే ఆ పాత్రలో చాలా ఎమోషన్స్‌ ఉంటాయి. ఇక సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని మొదట్లో మేము అనుకోలేదు. షూటింగ్‌ చేయడానికి ముందే మాకు మా పాత్రలకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు సెట్‌ వచ్చిన తర్వాత తెలిసింది. మనం ఓ భారీ చిత్రంలో నటిస్తున్నామని. బాహుబలి జర్నీని చాలా ఆస్వాదించాం
అంతర్జాతీయంగా ‘బాహుబలి’ పాత్రకు అంత క్రేజ్‌ రావడానికి కారణం ఏంటి?
ప్రభాస్‌: అది కథలో ఉన్న బలం. ప్రేక్షకుల్లో భిన్న రకాలు ఉంటారు. అలాంటి వారందరికీ నచ్చేలా రాజమౌళి ఆ పాత్రను డిజైన్‌ చేశారు. ఒక పిల్లాడి కోసం శివగామి పాత్ర త్యాగం చేయడంతో సినిమా మొదలవుతుంది. దీంతో ఆ పిల్లాడు ఎలా పెరిగి పెద్దవాడవుతాడనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరుగుతుంది. 
కథలో చివరిగా వచ్చిన పాత్ర ‘బాహుబలి’
ఈ పాత్ర చేసేటప్పుడు ఇంత భారీ విజయం సాధిస్తుందని మీరు అనుకున్నారా? 
ప్రభాస్‌: రాజమౌళి గత చిత్రాల స్టామినో ఏంటో అందరికీ తెలుసు. అయితే, ఒక ప్రాంతీయ చిత్రం అన్ని ప్రాంతాల వారికీ నచ్చుతుందా? అన్న అనుమానం మాత్రం ఉండేది. అయితే, ‘బాహుబలిని’ అందరూ ఆదరించారు. ఈ సినిమాను రాజమౌళి 12ఏళ్ల కిత్రమే మొదలు పెట్టారు. 
‘బాహుబలి’ పాత్రను చేయమని రాజమౌళి డిమాండ్‌ చేశారా?
ప్రభాస్‌: అలా ఏమీ లేదు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌ అలాంటిది. చాలా కష్టపడి పనిచేస్తారు. సినిమా అంటే పిచ్చి ఆయనకు. అయితే, కథలోని పాత్రలు మమ్మల్ని డిమాండ్‌ చేశాయి. 

No comments:

Post a Comment