Coffee Today

Sunday, October 6, 2019

Bollywood Rejected SYEE RAA Movie !

సైరా'ను రిజెక్ట్ చేసిన నార్త్ ఇండియన్స్!

చిరంజీవి పుష్కర కాలం కల 'సైరా.. నరసింహారెడ్డి' ఉత్తర భారత సినీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయింది, ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన అక్టోబర్ 2వ తేదీ ఆ మూవీ కేవలం 2 కోట్ల 60 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించింది. విడుదలకు ముందు ముంబైలోనూ ఈ సినిమాని చిరంజీవి బృందం బాగా ప్రమోట్ చేసింది. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నార్త్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూసిన నటుడు-దర్శకుడు ఫరాన్ అఖ్తర్ కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. 
'సైరా' హిందీ వెర్షన్ కనీస వసూళ్లు సాధించలేకపోవడానికి ప్రధాన కారణం.. అదే రోజు విడుదలైన 'వార్' సినిమా అని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ ఫిలింగా రూపొందిన ఆ సినిమా.. విడుదలకు ముందు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కారణం ఇద్దరు బాలీవుడ్ టాప్ యాక్షన్ హీరోలు.. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించడం. ఆ ఇద్దర్నీ ఒకే సినిమాలో చూడ్డం కోసం ప్రేక్షకులు.. అందులోనూ యూత్ ఆడియెన్స్.. వెర్రివాళ్లలా థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. 
అందుకు తగ్గట్లే 'వార్' మూవీ తొలిరోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది. గత హిందీ సినిమాల రికార్డులన్నింటినీ తుడిచిపెడ్తూ దేశవ్యాప్తంగా ఆ మూవీ 53 కోట్ల 35 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించింది. ఈ క్రమంలో 52 కోట్ల 25 లక్షల రూపాయలతో ఆమిర్ ఖాన్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందోస్తాన్' నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. 
ఇక రెండో రోజు కూడా 24 కోట్ల 35 లక్షల రూపాయలను కలెక్ట్ చేసింది 'వార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో 'వార్'కు రెండు రోజుల్లో 3 కోట్ల 86 లక్షల రూపాయలు వచ్చాయి. అదే సమయంలో రెండో రోజు నుంచి 'సైరా'కు హిందీ బెల్టులో ఎంత కలెక్షన్ వచ్చిందనే సమాచారం ఇప్పటివరకూ అందుబాటులోకి రాలేదు. అయితే మన ఏరియాలో 'వార్'కు వచ్చినంత కలెక్షన్ కూడా 'సైరా' హిందీ వెర్షన్‌కు రాలేదని విశ్లేషకులు అంటున్నారు. 
బాధాకరమైన విషయమేమంటే 'సైరా' విడుదలైన కొన్ని థియేటర్లలో మూడో రోజు నుంచి 'వార్' బొమ్మ పడటం! అంటే 'వార్' స్క్రీన్స్ పెరగగా, ఆ మేరకు 'సైరా' స్క్రీన్స్ తగ్గిపోయాయి. సాధారణంగా దేశభక్తి సినిమాలను ఉత్తర భారతీయులు బాగా ఆదరిస్తుంటారు. అలాంటిది 'సైరా' మూవీని కనీస స్థాయిలోనూ వాళ్లు ఎందుకు ఆదరించట్లేదనే ప్రశ్న వస్తోంది. 'సైరా' కథ తెలుగు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి సంబంధించినది కావడం వల్ల, అందులోనూ ఆ పేరు వాళ్లకు ఏమాత్రం తెలియనిది కావడం వల్ల.. వాళ్లు ఆ మూవీని 'ఓన్' చేసుకోలేకపోయారని విశ్లేషిస్తున్నారు విమర్శకులు. అందువల్లే తమ ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ ఉత్తరాది ప్రేక్షకులు 'సైరా' వైపు చూడటం లేదని అనుకోవాలి.
270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తీసిన 'సైరా'.. నష్టాల పాలవకుండా ఉండాలంటే హిందీలోనూ ఆ సినిమా మంచి వసూళ్లను తెచ్చుకోవాల్సి ఉంది. ఆ ఏరియాలో ఆశించిన రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ రాకపోవడంతో రాంచరణ్ స్వయంగా రిలీజ్ చేశాడు. కానీ అక్కడ కనీస వసూళ్లు రాకపోవడమే బాధాకరం. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఓవర్సీస్.. కలిపి 153 కోట్ల రూపాయల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది 'సైరా'. తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో రాంచరణ్ స్వయంగా రిలీజ్ చేశాడు. ఆయా ప్రాంతాల్లో అక్కడి భాషలోనే డబ్ చేసి మరీ సినిమా రిలీజ్ చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సహా, ఈ సినిమాకు టెక్నీషియన్స్ కానీ, నటులు కానీ పెట్టిన శ్రమ సామాన్యమైంది కాదు.. అయినప్పటికీ హిందీ ప్రేక్షకులు 'సైరా'పై ఏమాత్రం కనికరం చూపలేదని వసూళ్లు తెలియజేస్తున్నాయి.

No comments:

Post a Comment